- ప్రజాధనంతో ప్రచార ఆర్భాటాలు మానేసి రైతు హామీలు అమలు చేయాలని డిమాండ్
- రూ.28 వేల కోట్ల రైతుబంధు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచన
- రుణమాఫీ, రైతుభరోసా, యూరియా, విద్యుత్, ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని విమర్శ
వేల్పూర్, జూలై 1:
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “రైతు ఆశీర్వాద సభ” వాస్తవానికి రైతుల “శాపనార్థాల సభ”గా మారిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని ఆరోపించారు.
వేల్పూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడం, రైతుబంధు బకాయిలు చెల్లించకపోవడం, యూరియా కొరత, వడ్ల కొనుగోళ్లలో జాప్యం, విద్యుత్ సమస్యల మధ్య రైతులు ప్రభుత్వాన్ని ఎలా ఆశీర్వదిస్తారని ప్రశ్నించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 11 సీజన్లలో రూ.73 వేల కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సీజన్లలో మూడు సీజన్ల రైతుబంధు బకాయిలను నిలిపివేసి సుమారు రూ.28 వేల కోట్ల మేర రైతులకు బాకీ పడిందని ఆరోపించారు. అందులో కేవలం రూ.2,500 కోట్లు విడుదల చేసి భారీ సభలు నిర్వహించడం ప్రజాధన వృథా అని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని, రాష్ట్రవ్యాప్తంగా రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం రూ.21 వేల కోట్లకే పరిమితమైందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 52 వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22 వేల మందికే జరిగిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ వ్యవసాయ శాఖ మంత్రి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడం కంటే ప్రచార రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెన్షన్ల పెంపు, రైతుభరోసా, వడ్ల బోనస్, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ వంటి ప్రధాన హామీలను పూర్తిగా అమలు చేయలేదని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు అసత్యమని పేర్కొన్న ఆయన, కేసీఆర్ హయాంలో తీసుకున్న అప్పులతో మిషన్ భగీరథ, కాళేశ్వరం, 24 గంటల ఉచిత విద్యుత్, చెక్‌డ్యామ్‌లు, కలెక్టరేట్లు, సచివాలయం వంటి శాశ్వత ఆస్తులు నిర్మించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో భారీగా అప్పులు చేసినప్పటికీ ప్రజలకు కనిపించే అభివృద్ధి లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు, ప్రచార ఆర్భాటాలు మానుకుని రైతులకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ మీడియా సమావేశంలో రేగుంట దేవేందర్, జెడి నాగధర్ రెడ్డి, కల్లెడ ఏలియా, ఆర్మూర్ మహేష్, బద్దం చిన్నారెడ్డి, రేగుల్లా రాములు, బద్దం అశోక్, కుంట ప్రతాప్ రెడ్డి, పాపయ్య పవన్, బోగా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

