నిజామాబాద్, జూలై 11: E6 న్యూస్ క్రైమ్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో దుబ్బ ప్రాంతంలో మహిళ మెడలో నుంచి మంగళసూత్రం, కమ్మలు అపహరించిన ఘటనపై పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య, ఐపీఎస్ శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్న కమిషనర్, దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని వెంటనే పరిశీలించి నిందితులను గుర్తించి త్వరితగతిన అరెస్టు చేయాలని సూచించారు.
అలాగే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని, నేరస్తుల కదలికలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించాలని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఈ పరిశీలనలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్-3 ఎస్‌ఐ హరిబాబు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

