పోచంపాడు ప్రాజెక్టు, పుష్కర ఘాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ వచ్చే ఏడాది 2027 సంవత్సరంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు, భక్తుల రాకపోకలకు అనువైన మార్గాలు, వాకింగ్ ట్రాక్‌లు, వాహనాల పార్కింగ్ సదుపాయాలు, అత్యవసర సేవల ఏర్పాట్లు, హెలిప్యాడ్‌కు అనువైన ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ, తాత్కాలిక పోలీస్ సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటు వంటి అంశాలపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
ఈ పరిశీలనలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని, ఇరిగేషన్ శాఖ డీఈ సురేష్, ఏఈ సుశాంత్ కుమార్, వంశీ, పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

