Breaking News

టౌన్-3 పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, డ్రగ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలి

నిఘా వ్యవస్థ పటిష్టం చేసి ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలి

నిజామాబాద్, జూలై 28 (E6 tv NEWS ప్రతినిధి): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. మంగళవారం టౌన్-3 పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని సమీక్షించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పెండింగ్ కేసులపై ప్రత్యేక కార్యాచరణ

అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని కమిషనర్ సూచించారు. ప్రతి కేసుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ప్రజల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించిన కమిషనర్, పాఠశాలలు, కళాశాలలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల బారిన పడి యువత ఆర్థికంగా నష్టపోకుండా అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.

కాలనీల్లో పోలీసింగ్, నిఘా వ్యవస్థ బలోపేతం

కాలనీల్లో ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకుని వాటిని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదించాలని కమిషనర్ తెలిపారు. నగరంలోకి వచ్చే అనుమానాస్పద వ్యక్తులపై నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడళ్లలో నిరంతర ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించాలని ఆదేశించారు.

డ్రగ్స్ నియంత్రణ, సాంకేతికత వినియోగంపై దృష్టి

డ్రగ్స్ నియంత్రణ కోసం యువతలో చైతన్యం కల్పించాలని, ప్రతి కేసు దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కమిషనర్ సూచించారు. అధికారులు, సిబ్బంది 24×7 హెడ్‌క్వార్టర్స్ పరిధిలో అందుబాటులో ఉండాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, విధి నిర్వహణలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు.ఈ తనిఖీలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ యాదవ్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్-3 ఎస్ఐ ఎ. హరిబాబు, ఎస్ఐ నారాయణతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *