Breaking News

అబద్ధపు ప్రచారాలు మానేసి.. పెండింగ్ పనులు పూర్తి చేయాలి: భీంగల్ బీఆర్ఎస్ నాయకులు

భీంగల్, జూలై 16: E6 న్యూస్ తాటికొండ గంగాధర్

భీంగల్ పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ బస్ డిపో, వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ వంటి అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకుడు సునీల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, అసత్య ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని భీంగల్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2022 జూన్ నెలలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. ఎన్నికలకు ముందు కేవలం 15 నెలల వ్యవధిలోనే ఆసుపత్రి నిర్మాణంలో సుమారు 70 శాతం పనులు పూర్తి చేసి, దాదాపు రూ.15 కోట్ల విలువైన పనులు నిర్వహించడంతో పాటు కాంట్రాక్టర్‌కు సుమారు రూ.13 కోట్ల బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు.

మిగిలిన రూ.7 కోట్ల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం గత 30 నెలలుగా కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుతం కూడా కోట్ల రూపాయల విలువైన పనులు పెండింగ్‌లో ఉండగా, వాటిని పూర్తి చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.

భీంగల్ ఆర్టీసీ బస్ డిపో కూడా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, అప్పటి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో నిధులు మంజూరు చేసి ప్రారంభించబడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్ డిపో సేవలు నిలిచిపోయినా, మూడేళ్లకు చేరువవుతున్నా వాటిని పునరుద్ధరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాల్లో భాగంగా భీంగల్ మున్సిపాలిటీకి కూడా మార్కెట్ మంజూరై, దాదాపు 70 శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయి, ప్రస్తుతం మార్కెట్ ప్రాంగణం నిర్లక్ష్యానికి గురై తుమ్మ చెట్లు పెరిగే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

ప్రజలకు సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ నాయకులు వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని, అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, అవినీతి, కమిషన్ రాజ్యం పెరిగిందనే ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇతరులపై నిరాధార ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ నాయకులు తమ పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని భీంగల్ బీఆర్ఎస్ నాయకులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *