ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఉత్తర తిరుమలలో ఘనంగా వనభోజన కార్యక్రమం
సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక రంగంలో వైశ్యుల పాత్ర ఆదర్శనీయం
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వనభోజనాలు నిర్వహించడం అభినందనీయం
ఇందూరు, జూలై 19 : E6 tv NEWS శివ ఠాకూర్
వైశ్యులంతా ఐక్యతగా ఉంటూ సమాజ అభివృద్ధితో పాటు రాజకీయంగానూ మరింత ముందుకు సాగాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర తిరుమలలో నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది వనభోజనాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ వైశ్య కుటుంబాలన్నీ ఒకేచోట చేరి సోదరభావంతో గడపడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో ఐక్యతే గొప్ప బలమని, వైశ్యులు పరస్పరం కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.
వైశ్యులు అంటే కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాదని, ఆధ్యాత్మిక సేవలు, ఆలయాల అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందుంటారని ఎమ్మెల్యే కొనియాడారు. సేవా కార్యక్రమాల్లో వైశ్య సమాజం పోషిస్తున్న పాత్ర ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.అంతకుముందు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉత్తర తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్, కోశాధికారి గాలి నాగరాజు, కార్యవర్గ సభ్యులు, ఆలయ ధర్మకర్త సంపత్, వైశ్య సంఘ ప్రతినిధులు, మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో వైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

