రెండు నెలలుగా విధులకు గైర్హాజరని మెడికల్ ఆఫీసర్ వెల్లడి
బుధవారం వచ్చి రిజిస్టర్లో సంతకం.. మధ్యలోనే వెళ్లిపోయినట్లు ఆరోపణ
గురువారం మళ్లీ విధులకు డుమ్మా
అనుమతులు లేకుండానే విధులకు దూరం: డిప్యూటీ డీఎంహెచ్ఓ
క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడి
నిజామాబాద్/పోచంపాడ్, జూలై 09 (E6 న్యూస్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి శివ ఠాకూర్):
అంతా తన ఇష్టం.. రావాలనుకుంటే విధులకు వస్తారు.. లేకుంటే రారు..! అధికారుల అనుమతులు లేకుండానే నెలల తరబడి విధులకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు..! ఇదీ నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లో మండల ఆరోగ్య అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎంహెచ్ఓ సింగం వినయ్ కుమార్ వ్యవహారంపై వినిపిస్తున్న విమర్శలు.
పోచంపాడ్ మండల ఆరోగ్య అధికారిగా విధులు నిర్వహిస్తున్న సింగం వినయ్ కుమార్ గత రెండు నెలలుగా విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని పోచంపాడ్ మెడికల్/ డ్రాయింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ మద్దుల రాకేష్ వెల్లడించారు. ఎంహెచ్ఓ విధులకు హాజరు కాకపోవడంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.
ఈ క్రమంలో బుధవారం పోచంపాడ్ పీహెచ్‌సీకి వచ్చిన ఎంహెచ్ఓ వినయ్ కుమార్ హాజరు రిజిస్టర్లో సంతకం చేసినట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు. అదే రోజు నుంచి తిరిగి విధులకు హాజరవుతున్నట్లు నమోదు చేసి, అనంతరం మధ్యలోనే వెళ్లిపోయినట్లు మద్దుల రాకేష్ పేర్కొన్నారు.
అయితే గురువారం ఎంహెచ్ఓ పూర్తిగా విధులకు హాజరు కాలేదని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మండల స్థాయిలో ప్రజారోగ్య వ్యవస్థను పర్యవేక్షించాల్సిన కీలక అధికారి వరుసగా విధులకు దూరంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతులు లేకుండానే విధులకు దూరం..?
ఈ వ్యవహారంపై డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా, ఎంహెచ్ఓ సింగం వినయ్ కుమార్ గత రెండు నెలలుగా ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా విధులకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సంబంధిత అధికారిపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ప్రజారోగ్యంపై పర్యవేక్షణ ఏదీ..?
మండల ఆరోగ్య అధికారిగా కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారి సుదీర్ఘకాలం విధులకు హాజరు కాకపోతే ప్రజారోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో మండల ఆరోగ్య అధికారి విధులకు దూరంగా ఉన్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
ఎంహెచ్ఓ గైర్హాజరు వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

