Breaking News

రణభేరి కాదు.. రాద్ధాంత భేరి: బీజేపీ, బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే భూపతి రెడ్డి విమర్శలు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే

బీఆర్‌ఎస్ బకాయిలను కాంగ్రెస్‌పై నెట్టివేయడం రాజకీయ దివాళాకోరుతనం

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపు

నిజామాబాద్, జూలై 18 (E6 tv NEWS ప్రతినిధి):

బీజేపీ చేపట్టిన కార్యక్రమం “రణభేరి” కాదని, అది కేవలం “రాద్ధాంత భేరి” మాత్రమేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శించారు. విద్యార్థుల సంక్షేమం పేరుతో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.

శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టివేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు శాశ్వత వైస్ ఛాన్సలర్లను కూడా నియమించలేదని, విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ల నియామకాలు జరిగి విద్యా వ్యవస్థ గాడిలో పడుతోందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, కాస్మోటిక్ చార్జీలను పెంచి పాఠశాలల నిర్వహణను మెరుగుపరిచామని చెప్పారు. అలాగే సుమారు 15 వేల మంది ఉపాధ్యాయులను నియమించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేశామని వివరించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామ గ్రామాన, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *