Breaking News

వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉప‌సంహ‌రించాలి: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి సీతక్క డిమాండ్!


  కొత్త చట్టంతో తెలంగాణపై రూ.2,000 కోట్ల అదనపు భారం!
   గ్రామీణ పేదల ఉపాధి హక్కులను దెబ్బతీసే నిబంధనలు వద్దు.
జూలై 2న రాష్ట్ర క్యాబినెట్ భేటీ తర్వాతే తుది నిర్ణయం.
   పీఎం ఆవాస్, రోడ్ల నిర్మాణానికి అటవీ అనుమతులపై కేంద్రం దృష్టికి కీలక అంశాలు.
న్యూఢిల్లీ:
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వీబీజీ రామ్‌జీ చట్టం’పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి మంత్రుల ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ తరఫున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త చట్టం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని వివరించిన ఆమె, తెలంగాణ అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు.
రాష్ట్రాలపై వేల కోట్ల అదనపు భారం!
సమావేశం అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. కొత్త చట్టంలోని నిబంధనలు రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారం మోపేలా ఉన్నాయని మండిపడ్డారు.
“గతంలో ఉపాధి హామీ పథకం కింద కూలీల వేతన భారాన్ని 100 శాతం కేంద్రమే భరించేది. మెటీరియల్ కాంపోనెంట్‌లోనూ 75 శాతం వాటా ఇచ్చేది. కానీ, కొత్త విధానంలో 60:40 నిష్పత్తిని తీసుకురావడం వల్ల తెలంగాణపై అదనంగా రూ.2,000 కోట్ల భారం పడుతుంది” అని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
జూలై 2న క్యాబినెట్ తుది నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే ఈ అంశంపై రెండుసార్లు భేటీ అయిందని సీతక్క తెలిపారు. జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ (క్యాబినెట్) సమావేశంలో ఈ సబ్ కమిటీ నివేదికపై చర్చించి, కొత్త చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని, ఆ తర్వాతే కేంద్రానికి అధికారికంగా సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలు & డిమాండ్లు:
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం: రాష్ట్రాలతో సంప్రదించకుండా చట్టాన్ని తేవడం సరికాదు. పనుల ఎంపిక, నిధుల కేటాయింపు అధికారాలన్నీ కేంద్రం వద్దే ఉంచుకోవడం వల్ల గ్రామ పంచాయతీల అధికారాలు, రాష్ట్రాల పాత్ర తగ్గిపోతుంది.
60 రోజుల ఉపాధి విరామం వద్దు: చట్టంలో ప్రతిపాదించిన తప్పనిసరి 60 రోజుల ఉపాధి విరామ నిబంధనను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. ఇది గ్రామీణ పేదల ఉపాధిని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా గిరిజన, ఐదో షెడ్యూల్, నీటి ఎద్దడి ప్రాంతాలకు దీని నుంచి మినహాయింపు ఇవ్వాలి.
నిధుల కేటాయింపు విధానం మారాలి: కేవలం 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా కాకుండా.. క్షేత్రస్థాయిలో ఉన్న ఉపాధి డిమాండ్‌ను బట్టి నిధులు ఇవ్వాలి. గత ఐదేళ్ల పనిదినాలకు 80 శాతం, ఆర్థిక సంఘం సిఫార్సులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలి.
90:10 నిష్పత్తి అమలు చేయాలి: తెలంగాణలోని ఐదో షెడ్యూల్ (గిరిజన) ప్రాంతాలకు ఈశాన్య రాష్ట్రాల తరహాలోనే 90:10 నిష్పత్తిలో కేంద్ర-రాష్ట్ర నిధుల వాటా ఉండాలి.
కొత్త పనులకు అనుమతి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వ్యక్తిగత భూ అభివృద్ధి, వరద పునరుద్ధరణ, వెదురు తోటలు, పశుగ్రాస అభివృద్ధి వంటి స్థానిక అవసరాల పనులను కూడా ఈ చట్టంలో చేర్చే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇవ్వాలి.
అటవీ అనుమతులు, పెండింగ్ నిధులపై పోరు
వీబీజీ రామ్‌జీ చట్టంతో పాటు తెలంగాణకు సంబంధించిన పలు పెండింగ్ అంశాలను మంత్రి సీతక్క కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు:
పీఎం ఆవాస్ యోజన: రెండేళ్ల క్రితమే లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి పంపినా కేంద్రం ఇంకా ఇళ్లను మంజూరు చేయలేదని, వెంటనే ఆమోదించాలని కోరారు.
రోడ్ల నిర్మాణానికి అటవీ అడ్డంకులు: పీఎంజీఎస్‌వై కింద ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్లమల, కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, బోర్ల నిర్మాణం అటవీ అనుమతుల వల్ల నిలిచిపోయాయి. కేంద్రమే రోడ్లు మంజూరు చేసేటప్పుడే అటవీ క్లియరెన్స్ కూడా ఇచ్చేలా విధానం తేవాలని కోరారు.
బకాయిల విడుదల: రాష్ట్రంలో ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించిన కేంద్ర పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందిస్తూ.. అటవీ అనుమతుల సమస్యలపై సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. గ్రామీణ పేదల హక్కులను కాపాడేలా, సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *