చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా? వేచి చూడాలి మరి.
నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని మహా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ అనుమతులు లేకుండానే గత రెండేళ్లుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందంటూ E6 న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు.
కథనం ప్రసారమైన అనంతరం సంబంధిత శాఖ అధికారులు ఆసుపత్రిని పరిశీలించి, ఆసుపత్రికి సంబంధించిన బోర్డులు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే, కేవలం బోర్డులు తొలగించడానికే పరిమితం కాకుండా, ఆసుపత్రి నిర్వహణపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించిన వారిపై బాధ్యత నిర్ధారిస్తారా? భవిష్యత్తులో ఇలాంటి అక్రమ ఆసుపత్రులు పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్యశాఖ ఎలాంటి కఠిన చర్యలు చేపడుతుందనే అంశంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించి, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



