జూలై 17న “ఇందూర్ రణభేరి” కార్యక్రమం నిర్వహణ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పిలుపు
ఇందూరు జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు పాత కలెక్టరేట్‌లోని ధర్నా చౌక్ వద్ద “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ప్రకటించారు.
బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని, ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం రూ.11 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏడాది దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, 4.5 లక్షల మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద విద్యార్థుల విద్యాభవిష్యత్తును మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెలా ఫీజులు చెల్లిస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడం దురదృష్టకరమన్నారు.
జూలై 17న నిర్వహించే “ఇందూర్ రణభేరి” కార్యక్రమానికి ఇందూర్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్, ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దినేష్ పటేల్ కులాచారి పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, కార్పొరేటర్ శ్రవణ్, బీజేపీ ఐటీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, నాయకులు అంబదాస్ రావు, వంశీ గౌడ్, విపుల్ రావు, రాజ్ గణేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

