అక్రమ మద్యంపై కోరడ జూలిపిస్తున్న యువ అధికారిని
క్షేత్రస్థాయి పర్యవేక్షణకు పెద్దపీట
మోర్తాడ్ ఎక్సైజ్ ఎస్సై బి. మానసకు ప్రత్యేక గుర్తింపు
స్పెషల్ స్టోరీ: ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్
మోర్తాడ్ : E6 న్యూస్
చేతిలో అధికారం ఉందని హడావుడి చేయరు.. కార్యాలయంలో కూర్చుని ఆదేశాలకే పరిమితం కారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా తెలుసుకుంటూ.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెడుతూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు మోర్తాడ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి. మానస. విధుల్లో నిబద్ధత.. నిర్ణయాల్లో స్పష్టత.. ప్రజలతో మమేకమయ్యే తీరు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోంది.
అక్రమ మద్యంపై నజర్..
మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా జరిగే కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సమాచారం అందితే చాలు.. సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తూ చర్యలు చేపడుతున్నారు. ఎక్సైజ్ చట్టాల అమలులో రాజీ పడకుండా వ్యవహరిస్తూ అక్రమ వ్యాపారులకు చెక్ పెట్టే దిశగా ముందుకు సాగుతున్నారు.
ఆఫీసు కంటే.. ఫీల్డ్‌లోనే ఎక్కువ
సాధారణంగా అధికారులంటే కార్యాలయాల్లో సమావేశాలు.. సమీక్షలు అనే భావన ఉంటుంది. కానీ బి. మానస పనితీరు అందుకు భిన్నం. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానిత ప్రాంతాలపై నిఘా ఉంచుతున్నారు. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తూ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.
కేసులే కాదు.. చైతన్యమూ ముఖ్యం
అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు కేవలం కేసులు నమోదు చేయడం ఒక్కటే పరిష్కారం కాదన్న దృక్పథంతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మద్యం, ఇతర చెడు వ్యసనాల కారణంగా కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలను వివరిస్తూ యువత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చట్టాన్ని అమలు చేయడంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు.
సిబ్బందితో సమన్వయం..
ఏ అధికారి విజయం వెనుక సిబ్బంది పాత్ర కీలకం. ఈ విషయాన్ని గుర్తించిన మానస తన సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తున్నట్లు శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, సమాచార వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టీమ్ వర్క్‌తోనే అక్రమ కార్యకలాపాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చన్న విధానంతో ముందుకు సాగుతున్నారు.
మహిళా అధికారిణిగా సవాళ్లకు ఎదురొడ్డి..
ఎక్సైజ్ శాఖలో క్షేత్రస్థాయి విధులు సవాళ్లతో కూడుకున్నవి. ఆకస్మిక తనిఖీలు, రాత్రివేళల్లో విధులు, అక్రమ వ్యాపారులపై చర్యలు వంటి సందర్భాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ మహిళా అధికారిణిగా వెనకడుగు వేయకుండా బాధ్యతలను నిర్వర్తిస్తూ బి. మానస తనదైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.
మోర్తాడ్‌లో ‘మానస’ ముద్ర..
విధి నిర్వహణలో నిబద్ధత.. అక్రమ కార్యకలాపాలపై కఠిన వైఖరి.. ప్రజలతో సత్సంబంధాలు.. సిబ్బందితో సమన్వయం.. ఇలా అన్ని అంశాల్లో తనదైన శైలిని ప్రదర్శిస్తూ మోర్తాడ్ ఎక్సైజ్ శాఖలో బి. మానస ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. చట్టాన్ని గౌరవించే వారికి స్నేహపూర్వకంగా.. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్న ఆమె పనితీరు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది.

