నిజామాబాద్, జూలై 5: E6 న్యూస్ నిజామాబాద్.
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డితో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.6.56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ పనుల్లో మార్కెట్ కమిటీ ఆధునీకరణ, షెడ్ల నిర్మాణం, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ రైతుల సంక్షేమంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తూ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని, అందుకే అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి విమర్శించారు. వ్యవసాయ రంగంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉండడం అభినందనీయమన్నారు.
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ యార్డుల అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చిస్తూ రైతులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. గత పాలనలో మార్కెట్ కమిటీలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు అన్ని వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
రూ.6.56 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మరింత ఆధునికంగా మారి రైతులకు మెరుగైన సేవలు అందిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

