Breaking News

పలాస ఎయిర్‌పోర్ట్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన!

పలాస ఎయిర్‌పోర్ట్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన!
పలాస (ఉద్దానం):
శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సుముఖంగా ఉందన్న ఆయన.. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి ఉద్దాన ప్రాంత ప్రజలు, రైతులు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మందస మండలం బిడిమి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పలాసలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కావడం వల్ల ఉద్దాన ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, పారిశ్రామికంగా, ఆర్థికంగా ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. భూములు కోల్పోయే రైతులు, నిర్వాసితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. చట్టప్రకారం ప్రతి ఒక్కరికీ తగిన నష్టపరిహారంతో పాటు మెరుగైన పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్దాన ప్రాంత భవిష్యత్తును మార్చే ప్రాజెక్టు ఇది కాబట్టి, భూసేకరణ విషయంలో రైతులు, స్థానికులు అధికారులకు సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, బాధిత రైతులు, ఉద్దాన ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
– E6TV వెబ్ డెస్క్, పలాస.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *