పీహెచ్సీ స్థాయిలోనే వ్యాధుల నమోదు – డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రాజశ్రీ
పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన 8 జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి
నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్
టీకాల ద్వారా నియంత్రించే వ్యాధులను సమర్థవంతంగా గుర్తించడం, నమోదు చేయడం, పర్యవేక్షించడం లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు.
ఈ సందర్భంగా ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్‌గా పాల్గొన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఎనిమిది జిల్లాల్లో నిజామాబాద్ కూడా ఒకటని తెలిపారు. ఇకపై వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (VPD-SIMS) పోర్టల్ ద్వారా జిల్లా స్థాయిలో కాకుండా నేరుగా పీహెచ్సీ స్థాయిలోనే టీకాల ద్వారా నియంత్రించే వ్యాధుల వివరాలను నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు టీకాల ద్వారా నియంత్రించే వ్యాధుల తీవ్రతను తగ్గించడం, వ్యాధుల వ్యాప్తి (అవుట్‌బ్రేక్స్)ను ముందుగానే గుర్తించడం, వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాల నాణ్యతను సమీక్షించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం పర్యవేక్షణ నిర్వహించడం, నిర్ణీత గడువులోపు అన్ని చర్యలను పూర్తి చేయడం అని వివరించారు.
పోలియో, మీజిల్స్–రూబెల్లా, డిఫ్తీరియా వంటి వ్యాధులకు సంబంధించిన లక్షణాలతో ఒకే ప్రాంతంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కేసులు నమోదైతే దానిని అవుట్బ్రేక్గా పరిగణిస్తామని తెలిపారు. అక్యూట్ ఫ్లాసిడ్ పారాలసిస్ (AFP) కేసులు గుర్తించిన వెంటనే మల నమూనాలు సేకరించాలని, మీజిల్స్–రూబెల్లా అనుమానిత కేసుల్లో ముక్కు, గొంతు స్వాబ్లు, సీరం లేదా మూత్ర నమూనాలను ప్రోటోకాల్ ప్రకారం సేకరించి హైదరాబాద్ ఐపీఎంకు కేసు ఇన్వెస్టిగేషన్ ఫారంతో పంపించాలని సూచించారు.
జిల్లాలో ఈ ఏడాది పోలియో ఏఎఫ్‌పీ కేసుల లక్ష్యం 10 కాగా ఇప్పటివరకు రెండు నమూనాలు పంపినట్లు తెలిపారు. మీజిల్స్–రూబెల్లా కేసుల్లో వార్షిక లక్ష్యం 35 కాగా ఇప్పటివరకు 22 నమూనాలు పంపగా, వాటిలో 14 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ టీకాల ద్వారా నియంత్రించే వ్యాధులను క్షుణ్ణంగా గుర్తించి, నమూనాలను నిబంధనల ప్రకారం సేకరించి సకాలంలో పరీక్షలకు పంపాలని వైద్యాధికారులకు సూచించారు. అలాగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ఆరోగ్య మహిళ కార్యక్రమంపై కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ అశోక్, ట్రైనర్స్ డాక్టర్ అజ్మల్, డాక్టర్ శ్రావ్య, డీడీఎం పృథ్వి, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ విద్య, డాక్టర్ సికందర్ నాయక్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శరణ్య, డాక్టర్ ప్రసన్న, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శిఖర్, ఎస్వో రాజేశ్వర్, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్ఈ గన్పూర్ వెంకటేశ్వర్లు, డీపీఓ విశాల, వినోద్‌తో పాటు వివిధ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల వైద్యాధికారులు, రిపోర్టింగ్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

