‘ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం’ – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య.
సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో ప్రజల అప్రమత్తతే కీలకమని పిలుపు.
‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం.
వర్ని, జూలై 8: E6 క్రైమ్ (శివ ఠాకూర్).
ప్రజల భద్రతే లక్ష్యంగా చేపట్టిన ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, జాకోర గ్రామాల్లో మొత్తం 31 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ బుధవారం ప్రారంభించారు. శ్రీనగర్ గ్రామంలో 15, జాకోర గ్రామంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, ఇందుకు సహకరించిన రెండు గ్రామ పంచాయతీలను కమిషనర్ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానం” అని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను వేగంగా గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారుతుందని, నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ నిర్వహణలో కూడా సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.
ప్రతి కుటుంబం, ప్రతి వ్యాపార సంస్థ తమ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, వర్ని ఎస్‌ఐ జి. వంశీకృష్ణ, కోటగిరి ఎస్‌ఐ శ్రీనివాస్, రుద్రూర్ ఎస్‌ఐ మనోజ్, శ్రీనగర్ సర్పంచ్ పూర్ణిమ కిరణ్, జాకోర సర్పంచ్ బి. పెద్ద సాయిలు, మాదాల చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, రిటైర్డ్ సైంటిస్ట్ తోట చేతన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కె. సురేష్ బాబు, ఉపసర్పంచ్ దస్తగిరి, బాలవికాస్ ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

