Breaking News

కేసీఆర్‌కు షాక్: మంత్రి సీతక్క లీగల్ నోటీసు – ‘అంగన్‌వాడీ మొబైల్’ స్కామ్ ఆరోపణలపై ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆమె ఈ చర్యకు పూనుకున్నారు. మంత్రి తరపు న్యాయవాది నాగులూరి కృష్ణ కుమార్ ఈ నోటీసులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపారు.
మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ మొత్తం తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ పర్యవేక్షణలో, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే జరిగిందని సీతక్క స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తనకు ఎటువంటి వ్యక్తిగత సంబంధం లేదని ఆమె నోటీసులో పేర్కొన్నారు. మొత్తం టెండర్ విలువే రూ. 44 కోట్లు కాగా, అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేయడం హాస్యాస్పదమని, ఇది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమేనని ఆమె మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని సీతక్క డిమాండ్ చేశారు. వచ్చే 48 గంటల్లోగా ఆ అభ్యంతరకర పోస్టులను తొలగించి, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ స్పందించని పక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి హెచ్చరించారు. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *