హైదరాబాద్ (E6TV ప్రతినిధి):
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రహదారుల నిర్మాణపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే హరీష్ రావు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
అసలు వాస్తవాలు ఇవే: మంత్రి సీతక్క క్లారిటీ
దేశవ్యాప్త నమూనా: HAM విధానం కొత్తదేమీ కాదని, 2016 నుంచే కేంద్ర ప్రభుత్వ సంస్థ NHAI దేశవ్యాప్తంగా 374కు పైగా ప్రాజెక్టులను ఈ మోడల్లోనే నిర్మిస్తోందని మంత్రి గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఏపీ, కర్ణాటక కూడా ఇదే ఫాలో అవుతున్నాయని తెలిపారు.
పారదర్శక టెండర్లు: టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాకముందే ‘అవినీతి’ అంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టెక్నికల్ బిడ్లు పూర్తయ్యాయని, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన జరుగుతోందని వివరించారు.
నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే: ఈ మోడల్లో 30 నెలల్లో రోడ్లు పూర్తి చేయడమే కాకుండా, తర్వాతి 15 ఏళ్ల పాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదేనని స్పష్టం చేశారు.
మొబిలైజేషన్ అడ్వాన్స్: NHAI నిబంధనల ప్రకారమే 10% అడ్వాన్స్ ఇస్తామని, అది కూడా వడ్డీతో సహా రికవరీ చేస్తామని చెప్పారు. ఇందులో ఎలాంటి రహస్యాలు లేవని పేర్కొన్నారు.
అభివృద్ధిని చూసి అసూయ పడకండి..
గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి పెంచాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని సీతక్క విమర్శించారు. రూ. 6,250 కోట్లతో 7,450 కిలోమీటర్ల మేర రోడ్లను ఆధునీకరిస్తుంటే, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా తమ ప్రభుత్వం పారదర్శకతతో ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
హరీష్ రావు ఆరోపణలు పచ్చి అబద్ధం.. గ్రామీణ రోడ్ల అభివృద్ధిని చూసి ఓర్వలేకే విషప్రచారం: మంత్రి సీతక్క ఫైర్!

