నాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిందెవరు? నేడు అనాలోచితంగా కీర్తించబడుతున్నదెవరు?
భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యాన్ని సాధించింది. అది కోట్లాది మంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన దశాబ్దాల త్యాగపోరాట ఫలితం. ఈ పోరాటానికి నాయకత్వం వహించినవారు జాతిపిత మహాత్మా గాంధీ.
మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి 1924 డిసెంబర్ 25న జన్మించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆయన వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే.
క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఏ ప్రధాన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లోనూ ఆయన పాల్గొన్నట్లు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు.
అయినా నేడు దేశమంతటా వాజ్ పేయి విగ్రహాల ఏర్పాటు చేయటం, రహదారులు, పలు సంస్థలు, ప్రజా స్థలాలు, పథకాల పేర్లలో మార్పులు చేయడం వంటి చర్యలను మనం చూస్తున్నాం.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాయకులుగా చలామణి అయిన వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా చిత్రీకరించే దుస్థితి దాపురించింది. అంతేకాకుండా మహాత్మా గాంధీ పేరును సంక్షేమ పథకాల నుంచి కుట్రపూరితంగా తొలగించడం; అహింస, లౌకికత్వం, సామాజిక న్యాయం వంటి గాంధీయ విలువలను బలహీనపరుస్తూ, స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉన్న, ఆ పోరాటాన్ని వ్యతిరేకించిన శక్తులు నేడు తమకు అనుకూలంగా చరిత్రను వక్రీకరిస్తూ తిరగరాయడం దురదృష్టకరం. ఇది భారతదేశ ప్రతిష్టకు అవమానం.
భారత దేశానికి స్వాతంత్ర్యం ఎవరు దానం చేయలేదు. అనేక ప్రాణత్యాగాలతో సాధించబడింది. ప్రస్తుత రాజకీయ భావజాలాలకు అనుగుణంగా గత చరిత్రను మార్చాలనుకోవటం అవివేకం. మహాత్మ గాంధీని కేవలం విగ్రహాలకు మాత్రమే పరిమితం చేసి, ఆయన ఆలోచనలను ఆచరణలో లేకుండా చూడాలన్నదే నేటి పాలకుల అనాలోచిత విధానంగా గోచరిస్తున్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి దుర్మార్గపూరిత కుట్ర భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.
స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన గాంధీని పక్కన పెట్టి, స్వాతంత్ర ఉద్యమంలో కనీసం ఎటువంటి పాత్రలేని వారిని కీర్తింప చేసినట్లయితే దేశం తన నైతిక విలువలను, ప్రజాస్వామ్య పునాదులను కోల్పోయి ప్రమాదంలో పడుతుందనేది వాస్తవం.
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన నిజమైన చరిత్ర పరిరక్షించబడాలని; పాలనలో, విద్యలో, ప్రజా సంక్షేమ పథకాలలో మహాత్మా గాంధీకి సముచిత స్థానం కల్పించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. కేంద్ర పాలకులు తాము అనుసరిస్తున్న అనాలోచిత విధానాలకు ఇకనైనా స్వస్తిపలకాలని సిపిఐ హితవు పలుకుతున్నది
- డాక్టర్ కె. నారాయణ
చైర్మన్,
జాతీయ కంట్రోల్ కమిషన్
భారత కమ్యూనిస్టు పార్టీ (CPI)
E6TV హైదరాబాద్
హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ‘మన్ కీ బాత్’ 129వ ఎపిసోడ్‌ను సామూహికంగా వీక్షించి వినే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ—
2025 సంవత్సరం అన్ని రంగాల్లో భారత్ గణనీయమైన ప్రగతి సాధించిన సంవత్సరంగా నిలిచిందన్నారు. దేశ భవిష్యత్తుకు యువతే ప్రధాన బలమని, యువశక్తితోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమని స్పష్టం చేశారు.
‘ఆపరేషన్ సిందూర్’ ప్రతి భారతీయుడికి గర్వకారణమని, భద్రత విషయంలో నేటి భారత్ ఎలాంటి రాజీ పడదని ప్రపంచానికి స్పష్టమైన సందేశం వెళ్లిందన్నారు. మహా కుంభమేళాకు కోట్లాది మంది తరలిరావడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తుల పట్ల ప్రజలు చూపుతున్న ఆసక్తిని ప్రశంసిస్తూ, అంతరిక్ష రంగంలో శుభాంశు శుక్లా సాధించిన విజయాలు దేశకీర్తిని మరింత పెంచాయని కొనియాడారు.
స్టార్టప్‌లు, వ్యవసాయం, ఫిట్‌నెస్ వంటి రంగాల్లో యువత వినూత్న ఆవిష్కరణలతో ముందుకు వస్తోందని, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. క్రీడారంగంలో కూడా భారత్ ఈ ఏడాది గణనీయమైన విజయాలు సాధించిందని తెలిపారు. నూతన సంకల్పాలు, స్పష్టమైన లక్ష్యాలతో 2026లోకి అడుగుపెడుతున్నామని ప్రధాని అన్నారు.
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్
2026 జనవరి 12న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ రెండో ఎడిషన్ నిర్వహించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. యువత తమ ఆలోచనలు, అభిప్రాయాలను దేశ అభివృద్ధికి ఎలా వినియోగించుకోవాలో సూచించేందుకే ఈ కార్యక్రమమని, ఇందులో తానే స్వయంగా పాల్గొంటానని తెలిపారు.
యువతకు ప్రేరణాత్మక ఉదాహరణలు
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ వంటి కార్యక్రమాలు యువత ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఐఐఎస్‌సీకి చెందిన గీతాంజలి, దుబాయ్‌లోని కన్నడ పాఠశాల, జమ్మూ–కాశ్మీర్ సాంస్కృతిక వారసత్వం వంటి ఉదాహరణలను ప్రధాని ప్రస్తావించారు.
భాష, సంస్కృతి & సామాజిక అంశాలు
భారతీయ భాషల ప్రోత్సాహానికి—ప్రత్యేకించి తమిళ భాషకు—కాశీ తమిళ సంగమం వంటి కార్యక్రమాల ద్వారా జరుగుతున్న కృషిని ప్రశంసించారు. స్వాతంత్ర్య సమరయోధురాలు పర్బతి గిరి జీకి ఘన నివాళులు అర్పించారు.
యాంటీబయాటిక్స్ దుర్వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం లేస్ కళాకారులను అభినందించగా, కచ్ వైట్ రణ్ను భారతదేశ సహజ సౌందర్యానికి ప్రతీకగా పేర్కొన్నారు.
ప్రజల కృషి, ప్రేరణాత్మక కథలతో భారత్ 2026లోకి మరింత ఉత్సాహంగా అడుగుపెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శ్రీ వెంకటరమణా రెడ్డి, శ్రీ రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీ కొమరయ్య, శ్రీ అంజి రెడ్డి, శ్రీ ఏ.వి.ఎన్. రెడ్డి, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ జీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

