హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న తీరుపై హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారతపై బీజేపీ చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనని కొట్టిపారేశారు.
అమలుపై చిత్తశుద్ధి లేదు..
2023 సెప్టెంబర్‌లోనే కాంగ్రెస్ మరియు ఇతర మిత్రపక్షాల మద్దతుతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, కేంద్రం దానిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని సైఫుల్లా ఆరోపించారు. “జనగణన, డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) పేరుతో బీజేపీ కొత్త మెలికలు పెట్టింది. నిజంగా మహిళలపై ప్రేమ ఉంటే 2024 ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు?” అని ఆయన ప్రశ్నించారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..
డిలిమిటేషన్ ప్రక్రియపై సైఫుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన చేపడితే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణ భారత రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది కేవలం ఉత్తర రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చే చర్య అని, దీనివల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ చరిత్రే సాక్ష్యం..
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ఎప్పుడూ వెన్నుముకగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు.
73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దే.
దేశానికి తొలి మహిళా ప్రధాని (ఇందిరా గాంధీ), తొలి మహిళా రాష్ట్రపతి (ప్రతిభా పాటిల్)ను అందించిన పార్టీ కాంగ్రెస్.
సరోజిని నాయుడు నుండి నెల్లీ సెంగుప్తా వరకు ఎందరో మహిళా దిగ్గజాలు పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు.
“బీజేపీలో ఇలా అత్యున్నత స్థాయి బాధ్యతలు చేపట్టిన ఒక్క మహిళా నాయకురాలినైనా చూపగలరా?” అని ఆయన సవాల్ విసిరారు.
తక్షణమే అమలు చేయాలి..
మహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా బిల్లును వాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు.
ఈ సమావేశంలో బహదూర్‌పురా ఇన్ ఛార్జ్ రాజేష్ కుమార్ పులిపాటి, చంద్రాయణగుట్ట నేత బి. నాగేష్, చార్మినార్ ప్రతినిధి మహమ్మద్ ముజీబుల్లా షరీఫ్, మలక్‌పేట్ నేత షేక్ అక్బర్, యాకుత్‌పురా ఇన్ ఛార్జ్ కె. రవి రాజ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా బిల్లుపై బీజేపీ డ్రామాలు.. అమలులో ఉద్దేశపూర్వక ఆలస్యం: హైదరాబాద్ డీసీసీ చీఫ్ సైఫుల్లా ధ్వజం

