హౌస్టన్ (టెక్సాస్):
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హౌస్టన్ వేదికగా నిర్వహించిన భారతదేశ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రవాస భారతీయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక జయరెడ్డి తన అద్భుత కూచిపూడి నృత్య ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి కుమార్తె అయిన జయరెడ్డి, ఇంత చిన్న వయసులోనే కూచిపూడి నృత్యంలో ఎంతో చక్కటి ప్రతిభను కనబరిచింది. ఆమె ముఖభావాలు, నృత్య రీతులు ప్రేక్షకులను, కార్యక్రమ నిర్వాహకులను ఎంతగానో అలరించాయి. జయరెడ్డి ప్రదర్శనకు ఫిదా అయిన నిర్వాహకులు ఆమె ప్రతిభను అభినందిస్తూ ప్రత్యేక ప్రశంసలు అందజేశారు.
తల్లి సుచరిత రెడ్డి హర్షం
సుదూర తీరంలో, అంతర్జాతీయ వేదికపై తన కుమార్తె భారతీయ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకోవడం పట్ల ఆమె తల్లి, పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి తీవ్ర సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే సాంస్కృతిక కళలపై జయరెడ్డికి ఉన్న ఆసక్తిని ఆమె అభినందించారు. పరాయి దేశంలో ఉన్నప్పటికీ మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పిన బాలిక జయరెడ్డిని పలువురు ప్రవాసాంధ్రులు అభినందిస్తున్నారు.

