Breaking News

కేటీఆర్ ‘నిలువెత్తు విషం’.. మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తు

హైదరాబాద్ (E6TV Web News): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ విదేశాల నుంచి తిరిగి వచ్చి ‘అబద్ధాల రావు’లా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని, ఆయన మాటల్లో నిలువెత్తు విషం కనిపిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణను 16 వేల కోట్ల మిగులు రాష్ట్రంగా కాంగ్రెస్ అప్పగిస్తే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని చామల విమర్శించారు. “కేసీఆర్ కుటుంబం పదేళ్లపాటు ఫామ్ హౌస్ నుంచే నిజాం నవాబుల్లా పాలన సాగించారు తప్ప, ఒక్కరోజు కూడా ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర నిధుల కోసం కేంద్ర మంత్రులను కలవలేదు” అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదరకుండా ఉంటే, కేసీఆర్ తనను తాను విశ్వేశ్వరయ్యగా భావించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని ఆయన ఎద్దేవా చేశారు.
కేటీఆర్ విద్యాభ్యాసంపై కూడా చామల అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆయన అమెరికా నుంచి దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని భూముల లెక్కలపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, మూసీ రివర్ బోర్డుకు గతంలో ఒక్క రూపాయి ఖర్చు చేయని వారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలుపెడితే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కృష్ణా జలాలు తెచ్చింది, ఎయిర్‌పోర్ట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మెట్రో రైలు నిర్మించింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీని కలిస్తే తప్పేంటని ప్రశ్నించిన చామల.. అందుకే ఆయనను ‘బడే భాయ్’ అని సంబోధించారని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబానికి ఎర్రవెల్లి, జనవాడ వంటి ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని **’మందిని ముంచే కిషన్ రెడ్డి’**గా అభివర్ణిస్తూ, కేటీఆర్ ప్రెస్ మీట్లను ప్రజలెవరూ పట్టించుకోరని, రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే విజమని చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *