అమరావతి:తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న శిక్షణ తరగతులకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతూ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి కాఫీ తాగుతూ, వారితో ముఖాముఖి చర్చించి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
కార్యకర్తల కోసం ‘E3’ మంత్రం
పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల ఆర్థిక ఎదుగుదలపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. “ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్” (Ethical Economic Empowerment – E3) పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. నీతి, నిజాయితీలతో కార్యకర్తలు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. “నా కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తానో.. టీడీపీ కుటుంబం (కార్యకర్తల) గురించి కూడా అలాగే ఆలోచిస్తాను” అంటూ కార్యకర్తలకు భరోసానిచ్చారు.
క్లీన్ అండ్ పాజిటివ్ పాలిటిక్స్
రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని పిలుపునిస్తూ చంద్రబాబు మూడు కీలక సూత్రాలను వివరించారు:
- క్లీన్ అండ్ గ్రీన్: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత.
- క్లీన్ ఎనర్జీ: భవిష్యత్ అవసరాల కోసం స్వచ్ఛమైన ఇంధనంపై దృష్టి.
- క్లీన్ పాలిటిక్స్: అవినీతి రహిత, పారదర్శక రాజకీయాల ద్వారా ప్రజలకు చేరువవ్వడం.
ఫీడ్ బ్యాక్ ఆధారంగా భవిష్యత్ ప్రణాళిక
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయి? ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలి? అనే అంశాలపై కార్యకర్తల నుంచి ఆయన నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని వివరించడంతో పాటు, పాజిటివ్ ఓట్ బ్యాంక్‌ను పెంచుకోవాలని సూచించారు. ప్రత్యర్థుల కుతంత్రాలను సామాన్య కార్యకర్త కూడా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని కోరారు.

