నిజామాబాద్ నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉక్కుపాదం మోపింది. శనివారం నాడు మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు పట్టణంలోని పలు క్లినిక్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ దాడులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ తోటావర్ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ సన్నీ డేవిస్ అయ్యాల మరియు సభ్యులు డాక్టర్ జకరయ్య నేతృత్వం వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో వైద్యం చేస్తున్న 11 మందిపై అధికారులు చర్యలు ప్రారంభించారు.
చర్యలకు గురైన వారిలో కసాబ్ గల్లికి చెందిన ఎం లింగ గౌడ్ ముజాహిద్ నగర్ కు చెందిన ఆరిఫ్ మహ్మద్ వీక్లీ బజార్ లోని వి లక్ష్మీ మనోహర్ రావు న్యాల్కల్ రోడ్ లోని దర్వాని నారాయణ మరియు మహేష్ కుందెన్ వర్ణి రోడ్ లోని అడ్లోరి రాజు ఆర్ ఆర్ చౌరస్తా ప్రాంతానికి చెందిన ఎ మల్లేశం మరియు సునీల్ ఉన్నారు. అలాగే ఆలోర్ గ్రామంలో క్లినిక్ లు నడుపుతున్న ఉప్పు రజనీకాంత్ మరియు గంగాకిషన్ లపై కూడా అధికారులు విచారణ చేపట్టారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అనుమతులు లేకుండా క్లినిక్ లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి కేవలం గుర్తింపు పొందిన డాక్టర్ల వద్దే చికిత్స చేయించుకోవాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సూచించింది.
నిజామాబాద్ లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్

