శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. అనంతనాగ్ పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే లాల్ చౌక్ వద్ద బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులు విధుల్లో ఉన్న పోలీసులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
అమర్‌నాథ్ యాత్ర విధుల్లో ఉండగా దారుణం
ప్రస్తుతం కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర భద్రతా విధుల్లో భాగంగా మోహరించిన పోలీసు బృందంపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆశిక్ హుస్సేన్ ఖురేషి (35) అనే హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆయనను అనంతనాగ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
బాధ్యత వహించిన ‘టిఆర్ఎఫ్’.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఈ పిరికిపందల దాడికి లష్కరే తొయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దాడి అనంతరం రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, పరారైన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా గత నాలుగు రోజులుగా అమర్‌నాథ్ యాత్ర నిలిపివేసినప్పటికీ, అనంతనాగ్ పట్టణంలో ముందస్తు జాగ్రత్తగా భద్రతా దళాలను భారీగా మోహరించారు.

