అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేదు.. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి
మద్నూర్, జూలై 29: (E6 tv NEWS: ప్రతినిధి)
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్పేట్ గ్రామంలో ఓ పెంకుటిల్లు బుధవారం కుప్పకూలింది.
గ్రామానికి చెందిన సరడే హన్మంత్ (తండ్రి: మైసజీ) నివాసముంటున్న ఇల్లు వర్షం ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఇంట్లోని గృహోపకరణాలు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి.అయితే, గత వారం రోజుల క్రితమే హన్మంత్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని తన కుమార్తె ఇంటికి వెళ్లడంతో ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పి ప్రాణనష్టం సంభవించలేదు.
మరోవైపు, మండలంలో కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా పాత, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్లను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

