Breaking News

అర్హులైన ధూంధాం కళాకారులకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

ఓట్యాట్‌పల్లిలో ఘనంగా తెలంగాణ ధూంధాం కళాకారుల బోనాల జాతర,

తెలంగాణ ఉద్యమ కళాకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి

మాక్లూర్, జూలై 29:E6 tv NEWS (శివ ఠాకూర్).
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అర్హులైన ధూంధాం కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మాక్లూర్ మండలం ఓట్యాట్‌పల్లి గ్రామంలోని ఒడ్డేటవ్వ ఆలయం వద్ద జిల్లా కళాకారుల వేదిక ఆధ్వర్యంలో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముందు గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పు దరువులు, శివసత్తుల, పోతరాజుల నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కళాకారులు తెలంగాణ ఉద్యమ గీతాలతో సందడి చేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆర్టీసీ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అష్ట గంగాధర్, కోశాధికారి రాంపూర్ సాయి మాట్లాడుతూ కళాకారుల ఐక్యతను చాటేందుకే ఈ బోనాల జాతర నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ అర్హులైన కళాకారులకు ప్రభుత్వం ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు కల్పించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

జిల్లా ఉపాధ్యక్షురాలు రేలారే రేలా గంగా మాట్లాడుతూ కళాకారుల సంక్షేమం కోసం అమ్మవారి ఆశీర్వాదం కోరుతూ బోనం సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో ఈ తరహా బోనాల జాతర నిర్వహించడం విశేషమన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు శ్రమించిన కళాకారుల జీవితాల్లో ఇప్పటికీ ఆశించిన మార్పు రాలేదని, ప్రభుత్వం వారి త్యాగాలను గుర్తించి ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు, ఇతర సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని కోరారు. జిల్లాలోని కళాకారులంతా ఒకే వేదికపై కలుసుకోవడం ఉద్యమ రోజుల్ని గుర్తు చేసిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోదావరి, సాయి లోవోల, సవిత, రాజేందర్, సలహాదారులు పస్కా నర్సయ్య, పాశం కుమార్, బొడ్డెన్న యాదవ్, కోకిల నాగరాజు, సహాయ కార్యదర్శులు కర్క రమేష్, క్రాంతికుమార్, గోరకంటి రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేందర్, ప్రశాంత్ రెడ్డి, మహేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చిట్టిబాబు, మాదాసు గోపి, తోగరి నర్సయ్య, చిన్న రాజేందర్, రవి నాయక్, డప్పు సంతోష్, మనోజ్, దివ్య, మానస, స్రవంతి, సమత, లత, శ్వేతతో పాటు జిల్లా ఉద్యమ కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *