36 గంటల్లో 300–450 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం..
వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు
నిజామాబాద్ జూలై 29: E6 tv NEWS (శివ ఠాకూర్).
బంగాళాఖాతంలో ఏర్పడిన కోర్ డిప్రెషన్ ప్రభావంతో తెలంగాణలో వచ్చే 36 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 300 నుంచి 450 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి వరద పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో గడచిన 24 గంటల్లో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే, ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో, రానున్న గంటల్లో ఈ వర్షపాతం పరిమాణం మరింతగా పెరిగే అవకాశం ఉంది, వాతావరణ శాఖ (IMD) ప్రకారం, రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.
భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న జిల్లాల్లో జిల్లా యంత్రాంగాలు ముందస్తు చర్యలు చేపట్టి, ప్రజలకు అవసరమైన హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు మధ్య, పశ్చిమ, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మధ్య మధ్యలో కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అయితే నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్గొండ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
ప్రజలు వర్షాల సమయంలో అనవసర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

