Breaking News

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు – కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు; ఇది తెలంగాణ రైతాంగ విజయం!by thou uyy

భీంగల్ (నిజామాబాద్ జిల్లా) – E6TV స్పెషల్ రిపోర్ట్ (శివ):
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలకు హైకోర్టు తీర్పుతో తెరపడిందని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్, బీజేపీల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
మండల పార్టీ అధ్యక్షులు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గత రెండున్నర ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని హైకోర్టు తీర్పుతో రుజువైందన్నారు. ప్రాజెక్టు మొత్తం ఖర్చే 94 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదని, ఇది 16 రిజర్వాయర్లు, 21 పంపు హౌస్‌లు, వేల కిలోమీటర్ల కాలువలతో కూడిన అద్భుత నిర్మాణమని నాయకులు గుర్తు చేశారు.
ముఖ్యంగా SRSP పునరుజ్జీవం (రివర్స్ పంపింగ్) ద్వారా జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంటలు ఎండిపోకుండా బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల రైతులకు నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో కప్పల వాగులను రివర్స్ పంపింగ్ ద్వారా మే నెలలో కూడా నింపడం వల్ల నేడు భీంగల్ పట్టణంలో తాగునీరు, సాగునీటికి కొరత లేకుండా పోయిందని తెలిపారు.
మేడిగడ్డ వద్ద కేవలం రెండు పిల్లర్లు కుంగిపోతే, వాటికి మరమ్మతులు చేయకుండా కేసీఆర్ గారిని బద్నాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తోసిపుచ్చడంతో బీఆర్ఎస్ నిర్దోషిత్వం చాటినట్లయిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ జెడ్పిటిసి చౌటుపల్లి రవి, మాజీ రైతు బంధు అధ్యక్షులు శర్మ నాయక్, మాజీ జిల్లా కోఆప్షన్ మోయీజ్, కౌన్సిలర్లు మల్లెల ప్రసాద్, బోదిరే నర్సయ్య మరియు ఇతర బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టింగ్: శివ, నిజామాబాద్ ప్రతినిధి, E6TV.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *