Breaking News

పత్తి పంటలో ప్యారా విల్ట్‌పై రైతులకు అవగాహన కల్పించిన ఏఈఓ అనిల్

అంతాపూర్ గ్రామంలో పత్తి పంట పరిశీలన

సరైన డ్రైనేజీ, శాస్త్రీయ నిర్వహణతో 90 శాతం వరకు మొక్కలను కాపాడవచ్చని సూచన

మద్నూర్, ఆగస్ట్ 1: (E6 tv NEWS, M.మస్నాజీ)

కామారెడ్డి జిల్లా అంతాపూర్ గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) అనిల్ పత్తి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు ప్యారా విల్ట్ (Para Wilt) సమస్యపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్యారా విల్ట్ అనేది పత్తి పంటలో వచ్చే శారీరక రుగ్మత (Physiological Disorder) అని, ఇది ఫంగస్, బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి కాదని తెలిపారు. మొక్క వేర్లు తగినంత నీరు, పోషకాలను పైభాగాలకు అందించలేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని వివరించారు.ఆకులు పచ్చగా ఉన్నప్పటికీ కిందికి వాలిపోవడం, మధ్యాహ్న సమయంలో మొక్కలు వాడిపోవడం, సాయంత్రానికి కూడా కోలుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. అధిక వర్షాల అనంతరం ఒక్కసారిగా ఎండలు పడటం, పొలంలో నీరు నిల్వ ఉండటం, సరైన డ్రైనేజీ లేకపోవడం వంటి పరిస్థితుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతుందని పేర్కొన్నారు.

ప్యారా విల్ట్ నివారణకు ముందుగా పొలంలో నీరు నిల్వ లేకుండా మంచి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని రైతులకు సూచించారు. అనంతరం కాపర్ ఆక్సీక్లోరైడ్ (COC) మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి, ప్రభావిత మొక్కతో పాటు చుట్టుపక్కల ఐదు నుంచి ఆరు మొక్కల వేరు భాగం పూర్తిగా తడిసేలా డ్రెంచింగ్ చేయాలని సూచించారు. డ్రెంచింగ్ సమయంలో పంపు ముందరి నాజిల్‌ను తొలగించి మందు నేరుగా వేరు భాగానికి చేరేలా చేయాలని వివరించారు.

డ్రెంచింగ్ అనంతరం వెంటనే 13:0:45 (మల్టీ-కే) పోషకాన్ని లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి ఆకులపై పిచికారీ చేయాలని తెలిపారు. ఈ విధానాన్ని వరుసగా రెండు రోజుల పాటు అమలు చేస్తే సుమారు 90 శాతం వరకు ప్యారా విల్ట్ ప్రభావిత మొక్కలు కోలుకునే అవకాశం ఉందని ఏఈఓ అనిల్ రైతులకు సూచించారు.రైతులు పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమస్యలు కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించి శాస్త్రీయ సలహాలు పాటించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *