Breaking News

ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేస్తే ఊరుకోం

బీజేపీ కార్పొరేటర్ల హెచ్చరిక

నిజామాబాద్ ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్)

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరవింద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ హెచ్చరించారు.జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రం సుధీర్, 22వ డివిజన్ కార్పొరేటర్ సాయి వైష్ణవి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు తగినన్ని నిధులు కేటాయించడం లేదని ఎర్రం సుధీర్ విమర్శించారు.

జిల్లాలో బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, 28 మంది కార్పొరేటర్లు, వందకుపైగా సర్పంచులు, లక్షలాది కార్యకర్తల బలం ఉందన్నారు. బీజేపీ గెలిచిన 28 డివిజన్లలో ఏదైనా ఒక డివిజన్‌లో పోటీకి రావాలని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. సంబంధిత కార్పొరేటర్ రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళితే ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమిటో తేలిపోతుందని అన్నారు.రాజకీయ బెదిరింపులను బీజేపీ కార్యకర్తలు సహించబోరని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర లేదని, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనుభవం కూడా లేదని ఎర్రం సుధీర్ వ్యాఖ్యానించారు.

సాయి వైష్ణవి మాట్లాడుతూ.. నిజామాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 28 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ఇతర పార్టీల పొత్తుతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మేయర్‌గా ఉంటే నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన మహేశ్‌కుమార్ గౌడ్ ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.22వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి తాను గెలిచానని సాయి వైష్ణవి తెలిపారు. రాజకీయ కక్షలకు తావివ్వకుండా డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అవసరమైతే తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమని ఆమె సవాల్ విసిరారు.సమావేశంలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *