Breaking News

సాయుధ రైతాంగ పోరాటం అజరామరం

అమరుల ఆశయాల సాధనకు సమరశీల ఉద్యమాలు నిర్మించాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

సుజాతనగర్, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర అజరామరమని, నాటి వీరోచిత పోరాటాల స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సభ శుక్రవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో నిర్వహించారు.

రావి నారాయణరెడ్డి స్థూపం వద్ద సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముత్యాల విశ్వనాధం ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, దేశ్‌ముఖ్‌ల భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వెట్టిచాకిరీ విముక్తి, భుక్తి, భూమి కోసం వేలాది మంది కమ్యూనిస్టు యోధులు త్యాగాలు చేశారని గుర్తుచేశారు.సాయుధ పోరాట చరిత్రలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల పాత్ర లేదని పేర్కొంటూ, చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను ఖండించారు. అమరుల ఆశయాలు నెరవేర్చేందుకు ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సమరశీల ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.

అనంతరం సాయుధ పోరాట యోధుడు కొమారి రామయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సాయుధ పోరాట యోధుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *