Breaking News

కాంగ్రెస్ 1000 రోజుల నయవంచన పాలనను ప్రజల్లో ఎండగడతాం

22A జాబితా పేరుతో ప్రైవేట్ భూముల యజమానులకు ఇబ్బందులు

రైతు భరోసా, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ను నిర్వీర్యం చేస్తున్నారు

ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

నిజామాబాద్, సెప్టెంబర్ 3:(E6tv NEWS ప్రతినిధి)
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల నయవంచన పాలనలో జరిగిన మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

22A జాబితాతో ప్రజలకు ఇబ్బందులు

రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పోయిందని గణేష్ బిగాల విమర్శించారు. ముఖ్యంగా 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు చేరడం వల్ల రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.భూములు 22A జాబితాలో చేరడంతో వాటిని విక్రయించడం, కొనుగోలు చేయడం, బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం వంటి లావాదేవీలు నిలిచిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ తదితర రక్షించాల్సిన భూములను నిషేధిత జాబితాలో చేర్చే ఉద్దేశం ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా చేర్చడం అన్యాయమని పేర్కొన్నారు.

2026 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున భూములను 22A జాబితాలో చేర్చిన వ్యవహారంలో అవసరమైన భూములతో పాటు అనేక ప్రైవేట్ భూములు కూడా జాబితాలో చేరాయని ఆయన ఆరోపించారు. అధికారుల తప్పిదాలకు ప్రజలను బాధ్యులను చేసి కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదన్నారు.తాను సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇల్లు కూడా 22A జాబితాలో ఉన్నట్లు వార్తలు వచ్చాయని గణేష్ బిగాల పేర్కొన్నారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తుల భూములు సైతం 22A జాబితాలో చేరుతున్నాయంటే రాష్ట్రంలో భూ రికార్డుల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు అండ

బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశామని గణేష్ బిగాల గుర్తుచేశారు. రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయ యాంత్రీకరణ కోసం యంత్ర లక్ష్మి వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు అండగా నిలిచామని తెలిపారు.

రైతుకు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రైతుబీమా పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించామని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతాంగాన్ని దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్యాయం

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందాల్సిన రైతు భరోసా, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తోందని గణేష్ బిగాల విమర్శించారు. ఎరువుల విషయంలోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రాష్ట్రంలో హైడ్రా పేరుతో కూల్చివేతల భయాన్ని సృష్టిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.కంటేశ్వర్ ఆలయ భూములు, అసైన్మెంట్ భూములు, గూపన్‌పల్లిలోని వక్ఫ్ భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రక్షించాల్సిన భూములను వదిలి.. ఎన్నో ఏళ్లుగా ప్రజలు అనుభవిస్తున్న ప్రైవేట్ భూములను 22A జాబితాలో చేర్చడం వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.బోధన్ పట్టణంలో దాదాపు 40 శాతం భూములు 22A నిషేధిత జాబితాలో చేరడంతో ప్రజలు తమ భూములను అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

‘బీఆర్‌ఎస్ ఎక్కడ?’ అన్నవారికి ధర్నానే సమాధానం

“బీఆర్‌ఎస్ పార్టీ ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించే వారికి ధర్నా కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలే సమాధానమని గణేష్ బిగాల అన్నారు.బీఆర్‌ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి పీకేస్తాడంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి వచ్చినా బీఆర్‌ఎస్‌ను ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు.బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని, ప్రజా సమస్యలపై ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రభుత్వాన్ని నిలదీస్తుందని స్పష్టం చేశారు.

22A నిషేధిత జాబితా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ప్రైవేట్ భూముల యజమానులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్, జగత్ రెడ్డితో పాటు డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *