Breaking News

పాఠశాలల ఆరోగ్యం బలోపేతానికి ప్రత్యేక చర్యలు

నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్).

జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK)పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ RBSK మొబైల్ హెల్త్ టీంలు ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆరు నెలలకు ఒకసారి సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులను గుర్తించి చికిత్స అందించడంతో పాటు, ప్రత్యేక వైద్య సేవలు అవసరమైన వారిని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (DEIC)కు రిఫర్ చేయాలన్నారు.

రిఫర్ చేసిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో అవసరమైతే రెండు రోజుల పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. పాఠశాల లేదా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించే ముందు సంబంధిత నిర్వాహకులకు సమాచారం అందించాలని, పరీక్షల అనంతరం గుర్తించిన వ్యాధులు, విద్యార్థుల వివరాలను సందర్శన రిజిస్టర్‌తో పాటు సంబంధిత రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు.కేవలం ఎత్తు, బరువు మాత్రమే కాకుండా విద్యార్థుల BMIతో పాటు అవసరమైన ఇతర ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని సూచించారు. SAM, MAM కేటగిరీ పిల్లలను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని న్యూట్రిషన్ సెంటర్‌కు పంపించి, 15 రోజుల పాటు చికిత్స, పోషకాహారం పొందేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు.

క్యాన్సర్ చికిత్స పొందుతున్న విద్యార్థులను గుర్తించి డైలీ క్యాన్సర్ కేర్ సెంటర్‌కు రిఫర్ చేయాలని, అనుమానిత క్యాన్సర్ కేసులను కూడా ఆశా, ఏఎన్‌ఎం, RBSK సిబ్బంది ద్వారా సంబంధిత కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. క్యాన్సర్ నోటిఫై చేయాల్సిన వ్యాధి కావడంతో ప్రతి ఆశా, ఏఎన్‌ఎం తమ సబ్‌సెంటర్ పరిధిలో, PHC వైద్యులు తమ పరిధిలో క్యాన్సర్ కేసుల లైన్‌లిస్ట్‌ను నిర్వహించాలని సూచించారు.విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఎంహెచ్‌వో తెలిపారు. అసాధారణ ప్రవర్తన, ఒంటరితనం, వ్యసనాలకు బానిస కావడం, గంజాయి, పొగాకు లేదా డ్రగ్స్ వినియోగం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులను గుర్తించి జిల్లా మానసిక ఆరోగ్య విభాగానికి సమాచారం అందించాలని సూచించారు. అవసరమైన వైద్య సలహాలు, చికిత్స కోసం టోల్‌ఫ్రీ నంబర్ 14416 ద్వారా సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా RBSK మొబైల్ టీంల ద్వారా విద్యార్థులకు నిరంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి విద్యా నైపుణ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయని డాక్టర్ రాజశ్రీ పేర్కొన్నారు.

ఈ సమీక్షలో RBSK ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ సికందర్ నాయక్, డాక్టర్ విద్య, డాక్టర్ రవీందర్, MCH మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవ్య, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవితేజ, డిస్ట్రిక్ట్ క్యాన్సర్ కేర్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, DEIC మేనేజర్ సచిన్, డిప్యూటీ డెమో దుర్గారావు, DHE ఘన్పూర్ వెంకటేశ్వర్లు, వివిధ RBSK మొబైల్ టీంల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *