కాంగ్రెస్ సర్కారుకు మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: జీవన్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత హరీష్ రావుపై నమోదైన లైంగిక వేధింపుల కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపులో భాగమేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలను రాజకీయ ఎత్తుగడలకు వేదికగా మార్చారని ఆరోపించారు.
22ఏ భూముల అంశం, రీయింబర్స్మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన జీవో 97 వంటి కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని జీవన్ రెడ్డి విమర్శించారు. శాసనసభను తప్పుదోవ పట్టించారని ఆరోపించిన ముఖ్యమంత్రిని సెషన్ పూర్తయ్యే వరకు అసెంబ్లీ నుంచి డిబార్ చేయాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. మహిళా పోలీసులను, పోలీసు బలగాలను ఉపయోగించి బీఆర్ఎస్ సభ్యులపై దాడులు చేయించారని ఆరోపించారు.
కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులపై ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించారు.
“కాంగ్రెస్ సర్కారుకు మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్”
అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
శాసనసభను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుపుతోందని విమర్శించిన జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కుట్రలు చేయడం మానుకోవాలని సూచించారు.
“బూతులతో నోరు ఎత్తడం కాదు.. ప్రాజెక్టుల డోర్లు ఎత్తాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం తక్షణమే గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

