ఆరోగ్య సూపర్‌వైజర్లకు డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ సూచనలు
పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాల్వంచలోని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, కొత్తగూడెం కార్యాలయ సమావేశ మందిరంలో ఆరోగ్య సూపర్‌వైజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. తుకారామ్ రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ భూక్యా రామ్ దాస్, డాక్టర్ టీ. ప్రతాప్, డాక్టర్ దినేష్, సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని డీఎంహెచ్‌ఓ మండలాల వారీగా సమీక్షించారు. ముఖ్యంగా గర్భిణీల నమోదు (ANC), గర్భిణీలకు నిరంతర వైద్య పరీక్షలు, అసంక్రమణీయ వ్యాధుల (NCD) స్క్రీనింగ్, చిన్నారుల ఆరోగ్యం–టీకాల కార్యక్రమం, జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమం (NLEP)పై వివరాలను పరిశీలించారు.ప్రతి గర్భిణీని సకాలంలో నమోదు చేసి, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అధిక ప్రమాద గర్భిణీలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణతో అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమణీయ వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ను మరింత పటిష్టంగా నిర్వహించాలని తెలిపారు. వ్యాధులు గుర్తించిన వారికి సకాలంలో చికిత్స అందించడంతో పాటు నిరంతర ఫాలోఅప్ ఉండేలా చూడాలన్నారు.టీకాలకు అర్హులైన ప్రతి చిన్నారికి జాతీయ టీకాల షెడ్యూల్ ప్రకారం టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీకాలు మిస్ అయిన పిల్లలను గుర్తించి వారికి అవసరమైన టీకాలు ఇప్పించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
కుష్ఠు వ్యాధి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చికిత్స పొందుతున్న హాన్సెన్స్ వ్యాధి (కుష్ఠు) రోగుల పరిస్థితిపై ప్రత్యేకంగా సమీక్షించారు. రోగులకు అందించాల్సిన MDT (మల్టీ డ్రగ్ థెరపీ) మందులను ఆరోగ్య సూపర్‌వైజర్లకు పంపిణీ చేశారు.రోగులు చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా వైద్యుల సూచనల మేరకు పూర్తి కోర్సును క్రమం తప్పకుండా కొనసాగించేలా ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ప్రతి రోగిని నిరంతరం ఫాలోఅప్ చేస్తూ మందుల వినియోగం, చికిత్స పురోగతిని పర్యవేక్షించాలన్నారు.
కుష్ఠు వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కుష్ఠు వ్యాధి నయం చేయగలదని, సకాలంలో గుర్తించి పూర్తిస్థాయి చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.జిల్లాలో అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డా. తుకారామ్ రాథోడ్ సూచించారు.


