Breaking News

నడిరోడ్డుపై బైక్‌ స్టంట్లు.. యువకుడిపై కేసు

ప్రమాదకర వీలింగ్‌కు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్న మఠంపల్లి పోలీసులు

మఠంపల్లి, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి).

నడిరోడ్డుపై ద్విచక్రవాహనంతో ప్రమాదకరంగా వీలింగ్‌ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకుడిని మఠంపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మఠంపల్లి ప్రధాన చౌరస్తా నుంచి జాన్‌పాడు, మట్టపల్లి రోడ్డుకు వెళ్లే మార్గంలో పర్వతం గోపీచంద్ (19) అనే యువకుడు ద్విచక్రవాహనంపై అత్యంత ప్రమాదకరంగా స్టంట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒంటి చక్రంపై బైక్ నడుపుతూ, అధిక వేగంతో విన్యాసాలు చేయడంతో రహదారిపై ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

గతంలోనూ ఇదే ప్రాంతంలో గోపీచంద్ ప్రమాదకరంగా బైక్‌ స్టంట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ తప్పించుకున్నాడు. తాజాగా మరోసారి అదే బైక్‌పై స్టంట్లు చేస్తుండగా మఠంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు.యువకుడితో పాటు ద్విచక్రవాహనాన్ని మఠంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. స్టంట్లకు ఉపయోగించిన బైక్‌ను అందించిన అతని మామ నాగేశ్వరరావుపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడం వల్ల పాదచారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులతో పాటు వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.ప్రమాదకర బైక్ స్టంట్లకు పాల్పడుతున్న యువకుడిని పట్టుకుని కేసు నమోదు చేసిన ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజుతో పాటు మఠంపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *