Breaking News

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి

అక్రమ ఇసుక, పశు రవాణాపై కఠిన చర్యలు: ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యమైన దర్యాప్తుతో సత్వర పరిష్కారం చూపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు.

పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. గ్రేవ్, ప్రాపర్టీ, దొంగతనం కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిందితులను త్వరగా అరెస్టు చేయడంతో పాటు చోరీ సొత్తును రికవరీ చేయాలని ఆదేశించారు.అక్రమ ఇసుక, పశు రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టడంతో పాటు యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు గ్రామాలు, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

పెట్రోలింగ్, బ్లూ కోట్స్ వాహనాలతో నిరంతరం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. సీసీటీఎన్‌ఎస్‌ 2.0తో పాటు సీఐఆర్, ఈ-సాక్ష, నాట్‌గ్రిడ్, గాండీవ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించి దర్యాప్తును మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.అనంతరం పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ.. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ శ్రీలక్ష్మి, ఎస్‌హెచ్‌ఓ విజయసింహారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *