Breaking News

దొంగ ఓట్ల నమోదుకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను ఉపయోగించొద్దు

అడిషనల్ కలెక్టర్‌కు బీజేపీ వినతిపత్రం.. జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపణలు

నిజామాబాద్, జూలై 30: (E6 tv NEWS: శివ ఠాకూర్)

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ను ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ప్రామాణిక పత్రంగా పరిగణించకూడదని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గురువారం అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, ప్రభుత్వం జీ.ఓ.ఎం.ఎస్. నెం.172 ద్వారా హడావుడిగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను అమల్లోకి తీసుకువచ్చిందని విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఈ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు.

ఈ సర్టిఫికెట్‌ను ఆధారంగా చేసుకుని దొంగ ఓట్ల నమోదుకు అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగాలని, మధ్యలో కొత్త పత్రాలను చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు.ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ భారత పౌరసత్వానికి రుజువు కాదని, అందువల్ల దానిని ఓటర్ల నమోదు కోసం ప్రామాణిక పత్రంగా గుర్తించరాదని ఆయన డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే ఓటర్ల నమోదు పారదర్శకంగా నిర్వహించాలని, ఈ విషయంలో జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్‌కార్ లక్ష్మీనారాయణ, నగ్గొల్ల లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, చింత శ్రీనివాస్ రెడ్డి, ఓం సింగ్, విజయ్ కృష్ణ, వంశీ గౌడ్, మరెడ్డి వనీత, పంచరెడ్డి అనిత, బెల్లాల్ శశాంక్, రమేష్, రాజేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *