కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, ఆగస్టు 26: (E6tv NEWS: శివ ఠాకూర్).
నిజామాబాద్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగింది. అనంతరం ఖిలా రోడ్డు, నెహ్రూ పార్క్‌లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.. మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
మతాల మధ్య ఐక్యతే తెలంగాణ బలం
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. మనిషిని మనిషిగా గౌరవించడం, ప్రేమించడం, కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించుకోవద్దని పిలుపునిచ్చారు.తెలంగాణ సమాజం ఎప్పటి నుంచో కులమతాలకు అతీతంగా కలిసి జీవించే గొప్ప సంస్కృతిని కలిగి ఉందని, ఈ సామరస్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ చూపిన శాంతి, కరుణ, సహనం, సోదరభావం మార్గంలో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సెక్యులర్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కులం, మతం, భాష, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించడం కాంగ్రెస్ పార్టీ విధానమని తెలిపారు. తెలంగాణలో ప్రతి పౌరుడు ప్రశాంతంగా, గౌరవంగా జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
భారీగా పాల్గొన్న ముస్లిం సోదరులు
ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో వేలాది మంది ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, శేఖర్ గౌడ్, నరాల రత్నాకర్, జావిద్ అక్రమ్, కుద్దూస్, హారున్, కార్పొరేటర్లు సజ్జాద్ రహీల్, నయీమ్ షారాన్, అబ్దుల్ కరీం, అబుద్ బిన్ హందాన్, అన్వార్, మొహమ్మద్ అహ్మద్, కోఆప్షన్ మెంబర్ మహేందర్ సింగ్, ఆసిఫ్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.మిలాద్ కమిటీ అధ్యక్షులు షాయిబ్ రజా, మహమ్మద్ అబ్బు రజా, రషీద్ రాజా, ముజహిద్ ఖాన్, పాప ఖాన్, జావీద్ ఖాన్, కయ్యుమ్, షబ్బీర్ రాజ్జాక్, జఫర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొయిన్, సమీ, రియాజుద్దీన్, సఫ్దర్, అఫ్రోజ్ ఖాన్, సాదిక్ సోహైల్, షేక్ మహబూబ్, పర్వేజ్, ఈసా తదితరులతో పాటు మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.






