జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ ప్రతినిధులు
కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ
నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS: శివ ఠాకూర్).
ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు శనివారం ఉదయం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి, జర్నలిస్టుల మిత్రుల అందరి తరఫు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తోందని, ముఖ్యంగా నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తోందని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచర్ రెడ్డి శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలం మంజూరు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ప్రెస్ క్లబ్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

ఈ సందర్భంగా కార్యదర్శి సుభాష్ వాగ్మారే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని ప్రభుత్వ సలహాదారు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సుదర్శన్ రెడ్డి, కొత్త కలెక్టర్ విధుల్లో చేరిన వెంటనే అధికారులతో సంప్రదింపులు జరిపి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రభుత్వ సలహాదారు ఇచ్చిన హామీపై ప్రెస్ క్లబ్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు జెట్టి గోవిందరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు, ట్రెజరర్ రాజ్‌కుమార్, జాయింట్ సెక్రటరీ రవి నాయక్, సభ్యులు తాళ్ల శ్రీధర్, జైపాల్, ప్రీతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


