సీతాయిగూడెంలో రీ-సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్
అర్హులైన భూహక్కుదారులకు పాస్బుక్లు పొందే అవకాశం
చండ్రుగొండ, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
భూ రీ-సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, ప్రక్రియను వేగవంతంగా, పూర్తి ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు.
గ్రామ పరిధిలో మొత్తం 1,823 ఎకరాలకు భూ రీ-సర్వే నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం గ్రామ సరిహద్దుల నిర్ధారణతో పాటు భూముల వివరాల పరిశీలన కొనసాగుతున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఇటీవల గ్రామ సభ నిర్వహించి, అన్ని శాఖల సమన్వయంతో రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.గ్రామంలో సుమారు 200 నివాసాలు ఉన్నాయని, భూమి ఉన్నప్పటికీ పట్టాదారు పాస్బుక్లు లేని వారు, పాస్బుక్లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి వివరాలు రికార్డులతో సరిపోలని వారు, రికార్డుల్లో భూముల వివరాలు నమోదు కాని సందర్భాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రీ-సర్వే పూర్తయిన అనంతరం భూముల వాస్తవ పరిస్థితిని గుర్తించి, అవసరమైన రికార్డు సవరణలు చేపట్టడంతో పాటు అర్హులైన భూహక్కుదారులకు పాస్బుక్లు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని గిరిజనులతో నేరుగా మాట్లాడి రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారు. రీ-సర్వే ద్వారా తమ భూముల హక్కులకు స్పష్టత లభిస్తుందని గిరిజనులు తెలిపారు. పాత భూ రికార్డులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉన్న భూములను గుర్తించడం ద్వారా గతంలో పరిష్కారం కాని సమస్యలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
గ్రామ పరిధిలోని అటవీ భూముల వివరాలను కూడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం 1920ల నాటి పాత మ్యాప్లు, భూ రికార్డులను పరిశీలించారు. అప్పటి భూముల హద్దులు, చెట్లు, కుంటలు, చెరువులు, తోటల వివరాలను అధికారులు నమోదు చేసిన విధానాన్ని తెలుసుకున్నారు. పాత హద్దు రాళ్లు అనేక ప్రాంతాల్లో కనిపించడం లేదని అధికారులు తెలపగా, రీ-సర్వేలో భూ హద్దులను స్పష్టంగా నిర్ధారించి భవిష్యత్లో సులభంగా గుర్తించేలా శాశ్వత హద్దు గుర్తులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్లు, పట్టాదారు వివరాలను పాత రికార్డులతో సరిపోల్చి ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. భూమి ఉండి రికార్డుల్లో నమోదు కాకపోవడం, పాస్బుక్ ఉన్నా క్షేత్రస్థాయిలో భూమి వివరాలు సరిపోలకపోవడం వంటి సమస్యలను గుర్తించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. ఏ ఒక్క అర్హుడి భూ వివరాలు కూడా రికార్డుల్లో తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రీ-సర్వేను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర ప్రసాద్, సర్వే అధికారులు, అటవీ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


