ఎమ్మెల్సీ మధును పదవి నుంచి తొలగించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్
ఏర్గట్ల, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఎమ్మెల్సీ మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్గట్ల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ మధు దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు.ఎమ్మెల్సీ మధు చేసిన వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్సీ మధును పదవి నుంచి తొలగించడంతో పాటు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపాలని డిమాండ్ చేశారు.
దళితుడు స్పీకర్‌గా ఉన్నారనే కారణంతోనే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకుండా స్పీకర్‌ను అవమానిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై, అలాగే దళిత స్పీకర్‌ను అవమానించేలా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్, మాజీ మండల అధ్యక్షుడు సోమదేవరెడ్డి, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శేఖర్, అడేం గంగాప్రసాద్, కొరుపల్లి లింగారెడ్డి, కొట్టాల శ్రీనివాస్, టమాటాల రవి, గడ్డం జీవన్, సంజీవ్ యాదవ్, జింక అనిల్, బద్దం లింగారెడ్డి, రేండ్ల రమేష్, మహేష్ యాదవ్, బాస శ్రీనివాస్, రఫీ, లోలపు రాజ్, దాసరి అశోక్, కాటిపల్లి రఘుపతి తదితర కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


