రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్
ఆగస్టు 2: E6 tv NEWS (A,తిరుపతి గౌడ్).
జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడంతో పాటు ఎన్నికల సమయంలో గౌడ సమాజానికి ఇచ్చిన హామీలన్నింటినీ ఆగస్టు 18లోపు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి – మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆగస్టు 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని లోతుకుంటలో బాలసాని సురేష్ గౌడ్ హైకోర్టు న్యాయవాది కార్యాలయంలో నిర్వహించిన గౌడ జన హక్కుల పోరాట సమితి ‘మోకు దెబ్బ’ జాతీయ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ సమాజానికి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆగస్టు 18న జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో గీత కార్మికులకు టీసీఎస్ (TCS), టీఎఫ్టీ (TFT) లైసెన్సులను వెంటనే పునరుద్ధరించాలని, లైసెన్సుల లేమితో ప్రమాదాల్లో మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, బీమా, సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసుకున్న వారికి 30 రోజుల్లో లైసెన్సులు జారీ చేసే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 50 శాతం లైసెన్సులను గౌడ సమాజానికి కేటాయించాలని, జి.ఓ. నెం.560ను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రతి గ్రామంలో కనీసం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని తాటి, ఈత, గిరక తాటి, ఖర్జూర వనాల అభివృద్ధికి కేటాయించాలని కోరారు. గీత కార్పొరేషన్ అభివృద్ధికి రూ.5,000 కోట్లు కేటాయించి, గీత కార్మికులకు ఆధునిక భద్రతా పరికరాలు, పనిముట్లు, మోపెడ్లు ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు.
కల్లు సహజ ఆహార పానీయమని, దానిని ఎక్సైజ్ శాఖ పరిధి నుంచి తొలగించి సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు. గీత కార్మికులపై పోలీసు, ఎక్సైజ్ శాఖల వేధింపులను నిలిపివేయడంతో పాటు రూ.10 లక్షల ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. నీరా పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పించి గౌడ యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని, ఏజెన్సీ ప్రాంత గౌడులకు ఎస్టీ (ST) సర్టిఫికెట్లు మంజూరు చేసి రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే “మా జనాభా ఎంతైతే… మా వాటా అంతే” అనే సూత్రం ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధి స్థానాల్లో గౌడ సమాజానికి జనాభా నిష్పత్తి మేరకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు రాగుల సిద్ధిరాములు గౌడ్, కొండాపురం బాలరాజ్ గౌడ్, ఏవీ బాలేషం గౌడ్, బాలసాని సురేష్ గౌడ్, ముత్యం నర్సింలు గౌడ్, కేసరి ఆంజనేయులు గౌడ్, ఆనంతుల రమేష్ గౌడ్, మహారాష్ట్ర ఇన్చార్జి కదిరే ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

