అవకాశం వస్తే సంఘం అభివృద్ధికి తొలి ప్రాధాన్యత: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్, సెప్టెంబర్ 6 (E6tv NEWS: ప్రతినిధి)
శ్రీ వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని, నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడు మామిడి రాజేందర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి నంగునూరి శ్రీనివాస్ గుప్తా (వాసు), కోశాధికారి అల్లా నగేష్ గుప్తా తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆర్యవైశ్య సంఘాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘానికి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.15 లక్షల చొప్పున నిధులు అందించామని, మరో రూ.5 లక్షల నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘ భవనం అభివృద్ధికి సుమారు రూ.1.50 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. అలాగే వైశ్య హాస్టల్‌కు రూ.1.25 కోట్ల నిధులు, మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కూడా నిధులు అందించినట్లు వివరించారు.
అన్ని కుల సంఘాలకు సమాన ప్రాధాన్యత
తాను కేవలం ఆర్యవైశ్య సమాజానికే కాకుండా నిజామాబాద్ నగరంలోని అన్ని కుల సంఘాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చానని గణేష్ బిగాల తెలిపారు. యాదవ, మున్నూరు కాపు, ముదిరాజ్, పద్మశాలి తదితర కుల సంఘాలకు కూడా నిధులు అందించి వారి సామాజిక అవసరాలకు సహకరించినట్లు చెప్పారు.సమాజం నుంచి నాయకత్వం ఎదగాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య నాయకులు, కార్యకర్తలకు రాజకీయంగా కూడా ప్రోత్సాహం అందించామని అన్నారు.
అవకాశం వస్తే తొలి ప్రాధాన్యత
అమ్మవారి ఆశీస్సులతో మరోసారి నిజామాబాద్‌కు సేవ చేసే అవకాశం లభిస్తే వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి తొలి ప్రాధాన్యతతో నిధులు కేటాయిస్తానని గణేష్ బిగాల హామీ ఇచ్చారు. ఆర్యవైశ్య సమాజం తనపై చూపిన ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు.నూతన కార్యవర్గం సంఘాన్ని మరింత బలోపేతం చేసి, సమాజ సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు, ప్రముఖులు, నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



