Breaking News

కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. 1,000 అబద్ధాల దగాపాలన

420 హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా

బాల్కొండ, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన 420 హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదని, ఇది 1,000 అబద్ధాల ‘దగాపాలన’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టడంతో పాటు 420 హామీల వైఫల్యాలను సూచిస్తూ 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో మానవహారం, ధర్నా నిర్వహించారు.

అనంతరం జరిగిన సభలో వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని, 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నేతలు ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తూ కాంగ్రెస్ నేతల హామీలను ప్రజల ముందు ఉంచారు. అయితే 1,000 రోజులు గడిచిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ‘ఐదేళ్లలో అమలు చేస్తామన్నాం’ అంటూ మాట మార్చడం సిగ్గుచేటని విమర్శించారు.

రైతులు, మహిళలు, యువతకు బకాయిలు:
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ అమలు కాలేదని, 33 నెలలకు ఒక్కో మహిళకు రూ.82,500 బకాయి పడిందని ఆరోపించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, 33 నెలలకు ఒక్కో కుటుంబానికి రూ.16,500 బకాయి ఉందన్నారు.

పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీ అమలు కాలేదని, పెంచాల్సిన మొత్తాన్ని లెక్కిస్తే ఒక్కో పింఛన్‌దారుడికి రూ.66,000 బకాయి ఉందని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి బాల్కొండ నియోజకవర్గంలోని సుమారు 5 వేల మంది ఆడబిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి, నిర్మాణ బిల్లుల్లో పూర్తి మొత్తాన్ని చెల్లించకపోవడంతో పేద కుటుంబాలపై అప్పుల భారం పడుతోందని విమర్శించారు.

రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, ధాన్యం బోనస్ విషయంలోనూ ప్రభుత్వం అన్యాయం చేసిందని వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. 4 ఎకరాల రైతుకు రైతుభరోసా కింద రూ.1,02,000, ధాన్యం బోనస్ కింద రూ.3 లక్షలు, రుణమాఫీ రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.6,02,000 వరకు బకాయి పడిందని తెలిపారు.

కౌలు రైతులకు, ఉపాధి హామీ కూలీలకు ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల బ్యాంక్ గ్యారెంటీ, యువతులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు, నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి, ఉద్యోగాల కల్పన వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకుండా, 6 డీఏలను పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్లలో ఇచ్చిన పలు హామీలు కూడా అమలుకు నోచుకోలేదని అన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్ సబ్‌స్టేషన్లు, చెక్‌డ్యాంలు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి శాశ్వత ప్రజా సంపదను సృష్టించిందని వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ అప్పుల విషయం తెలిసే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల సాకు చూపడం అవకాశవాద రాజకీయమని మండిపడ్డారు.

తదుపరి కార్యాచరణ

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ ప్రజల తరఫున రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు.

  • సెప్టెంబర్ 3: వేల్పూర్ ఎక్స్‌రోడ్ వద్ద రైతుల సమస్యలపై భారీ రైతు సదస్సు
  • సెప్టెంబర్ 4: మోర్తాడ్‌లో మహిళల సమస్యలు, పింఛన్లు, మహాలక్ష్మి బకాయిలపై వంటా-వార్పుతో మహిళా సదస్సు
  • సెప్టెంబర్ 5: భీమ్‌గల్‌లో విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై విద్యార్థి–యువజన సదస్సు
  • సెప్టెంబర్ 6, 7, 8: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బూత్ కమిటీల ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెల్లించాల్సిన బకాయిల వివరాలతో ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ పంపిణీ

ఎండ, వాన, పోలీసుల నిర్బంధాలను లెక్కచేయకుండా ప్రజల పక్షాన పోరాడుతామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *