Breaking News

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి

సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా వారం రోజుల నిరసన కార్యక్రమాలు

ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్,ఆగస్టు 31: (E6tv NEWS: ప్రతినిధి)

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అమలు కాని హామీలు, ప్రజలపై మోపిన భారాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు నియోజకవర్గవ్యాప్తంగా “సమరభేరి” కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సోమవారం హుజూరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విలేకరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు తదితర వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని అన్నారు.

సమరభేరి కార్యక్రమాల షెడ్యూల్

సెప్టెంబర్ 2 – హుజూరాబాద్:

ఉదయం 10 గంటలకు హుజూరాబాద్ చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ప్రజలకు వివరించేలా ‘బాకీల కార్డు’ పంపిణీ, 420 అడుగుల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 3 – వీణవంక:

వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, యూరియా కొరత, రైతు బీమా, రైతు సంక్షేమ అంశాలపై రైతులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

సెప్టెంబర్ 4 – కమలాపూర్:

మహిళలకు ఇచ్చిన నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల తదితర హామీల అమలును డిమాండ్ చేస్తూ వంటావార్పు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 5 – జమ్మికుంట:

ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ అమలు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

సెప్టెంబర్ 6 – గ్రామపంచాయతీలు, ఆటో కార్మికుల ఆందోళనలు:

హుజూరాబాద్‌లో ఉదయం 10 గంటలకు, జమ్మికుంటలో 11 గంటలకు, ఇల్లందకుంటలో మధ్యాహ్నం 12 గంటలకు గ్రామపంచాయతీల ఆర్థిక సమస్యలు, పెండింగ్ బిల్లులు, మౌలిక వసతుల కొరత తదితర అంశాలపై నిరసనలు చేపట్టనున్నారు. ఆటో కార్మికులతో భారీ ర్యాలీలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 7 – ఐదు మండలాల్లో ప్రజావాణి:

నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలు, ఫిర్యాదులతో కూడిన వేలాది వినతిపత్రాలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు.

సెప్టెంబర్ 8 – కరీంనగర్ జిల్లా కేంద్రం:

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించడంతో వారం రోజుల సమరభేరి కార్యక్రమాలను ముగించనున్నట్లు తెలిపారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ వారం రోజుల కార్యక్రమాల్లో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ చేపడుతున్న సమరభేరి ప్రజా ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్, పోల్నెని సత్యనారాయణ రావు, నైనేని తిరుపతిరావు, పింగిలి రమేష్‌తో పాటు వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట మండలాలు, హుజూరాబాద్–జమ్మికుంట మున్సిపాలిటీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *