కొత్త అప్రోచ్ రోడ్లు, MRR, CRR, హ్యామ్ రోడ్ల పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచన
నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం
నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్ )
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) వీరానంద్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో చేపడుతున్న కొత్త అప్రోచ్ రోడ్లు, ఎంఆర్ఆర్ (MRR), సీఆర్ఆర్ (CRR), హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే గ్రామాల్లో నిర్మిస్తున్న వివో భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన చోట తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత మరమ్మతులు కూడా చేపట్టాలని అధికారులకు సూచించారు.గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కొన్ని రోడ్లలో నాణ్యత లోపాల కారణంగా పలు చోట్ల దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాధనం వృథా కాకుండా ప్రతి అభివృద్ధి పనిని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, నిర్మాణ పనులపై అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

నియోజకవర్గ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు. ప్రతి అభివృద్ధి పనిని పారదర్శకంగా, నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

