నాగేంద్రనగర్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల మంజూరు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హత పొందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సందె రంజిత్ మాట్లాడుతూ.. పేద, అర్హత కలిగిన కుటుంబాలకు రేషన్ కార్డు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ గుర్తింపు పత్రంగా నిలుస్తుందని తెలిపారు. రేషన్ కార్డు ద్వారా ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద అందే ప్రయోజనాలతో పాటు, అర్హతను బట్టి వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు పొందని కుటుంబాలను గుర్తించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ప్రయోజనం కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారని సర్పంచ్ తెలిపారు. ప్రజలు అధికారులకు అవసరమైన సహకారం అందిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సందె రంజిత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

