తొలి ఏడాదిలోనే 70 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ: డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి
భీంగల్, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి).
ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో యువత సంక్షేమం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందని డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్ అన్నారు. పదేళ్ల నిరుద్యోగాన్ని తరిమికొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 70 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.
భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సహస్ర ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సభలో నాయకులు మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి మంత్రంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, విద్య, క్రీడలు, పారిశ్రామిక అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించి, చదువు–నైపుణ్యం–ఉద్యోగం దిశగా అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా 2024 డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. అలాగే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 వంటి నియామక పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించే చర్యలు చేపట్టిందన్నారు.ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పరిశ్రమలు వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేయడంతో యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగ మేళాల ద్వారా యువతను ప్రైవేట్ కంపెనీలతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.
క్రీడల్లో ప్రతిభ ఉన్న యువతకు శిక్షణ, విద్య, కెరీర్ అవకాశాలను మెరుగుపరిచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. యూత్ లీడర్‌షిప్ సమ్మిట్, కెరీర్ అండ్ స్కిల్ డే, స్పోర్ట్స్ డే వంటి కార్యక్రమాలతో యువతలో నాయకత్వ లక్షణాలు, కెరీర్ అవగాహన పెంపొందిస్తున్నామని చెప్పారు.
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యమకర్తలుగా, ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని నాయకులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువతకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం, సబ్సిడీతో రుణాలు అందించే విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
యువతే తెలంగాణ భవిష్యత్తు అని పేర్కొన్న నాయకులు.. విద్య, నైపుణ్యం, ఉద్యోగం, స్వయం ఉపాధి, క్రీడలు, నాయకత్వ అభివృద్ధి వంటి ప్రతి రంగంలో అవకాశాలు కల్పిస్తూ యువ తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. “యువతకు ఉద్యోగం మాత్రమే కాదు.. ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగే అవకాశాలను కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” అని అన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


